పురాణాల్లో పతివ్రతలు ఈమె ముందు దిగదుడుపే…

303

పురాణాల్లో పతివ్రతలు ఈమె ముందు దిగదుడుపే…

ఆరోగ్యం బాగాలేని తల్లి , చెల్లి , బార్య , కొడుకు వైద్యం ఖర్చులకు రిక్షా తొక్కడమో , కూలీ పని చేయడమో, చావుకుతెగించి పోటీలలో పాల్గొని ప్రయిజ్ మనీ గెలిచి అయినవారిని ,కన్నవారిని బ్రతికించుకోవడం సినిమాల్లో మాత్రమే చూసి మనం చలించే సన్నివేశం .. అయితే ఇది నిజజీవితంలోనూ జరిగింది.. మనిషి అన్నవాడిని కన్నీటి తడిలో ముంచే సన్నివేశం .. ఇది..
వృద్ధాప్యంలో ఉన్న భర్త అనారోగ్యానికి మందులకు డబ్బులు లేక 65 ఏళ్ళ భార్య పరుగుపందెంలో పాల్గొని గెలిచింది.. మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉండే 65 ఏళ్ల లతమ్మ కు ముగ్గురు ఆడపిల్లలు . . ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న డబ్బు హరించుకు పోయింది. అందినంతవరకు చేసిన అప్పులు మిగిలాయి.ఒకరోజు భర్త నలతగా ఉందని చెప్పాడు. స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పెద్ద ఆసుపత్రిలో చూయించాల్సిందే నని చెప్పాడు. అక్కడచూపిస్తే ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మన్నారు . ఊర్లో అక్కడాఇక్కడా డబ్బులు పోగేసుకొని పొతే ఆ డబ్బులు చాలలేదు.. టెస్టులకు మరో మూడువేలు తెమ్మన్నారు.. తినేందుకు తిండిలేని పరిస్థితుల్లో , ఊరికిపోయేందుకు చార్జీలకు కూడా డబ్బుల్లేక ఆసుపత్రి వరండాలోనే పడుకున్నారు. అనారోగ్యంతో ఉన్న భర్తకు రెండు సమోసాలు తెచ్చి ఇచ్చింది.. సమోసాలు కట్టి ఇచ్చిన కాగితంలో ఓ ప్రకటన ఆమెలో ఆశలు రేకెత్తించింది.
“బారామతి మారథాన్ గెలవండి 3000 వేలు నగదు పొందండి” అని ఉన్నది. ఆమె మనసులో అనేక ఆలోచనలు చేసింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమత మయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.
‘బారామతి మారథాన్’ మొదలవబోతూ ఉంది. పోటీ దారులు అందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు.
9 గజాల నేత చీర కల్లుకుని, కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా, తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పోల్గొనటానికి అనుమతి అడిగినప్పుడు అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు. ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది. ప్రాదేయపడింది. బ్రతిమాలింది. చివరికి అభ్యర్దిగా రంగంలోకి దిగింది.
పోటీ మొదలయ్యింది. లతమ్మ. లేడిలా పరిగెత్త సాగింది. పులిలా ఉరికింది.. ఆమెకి తన వయసుగాని రోడ్డున కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కాని, ఎర్రటి ఎండ కానీ తెలీదు. తెలిసిందల్లా తను గెలవాలి మూడు వేలు తీసుకోవాలి, భర్తకి టెస్టులు చేయించాలి సరైన వైద్యం చేయించాలి. తన బర్త బతకాలి. తనకి జీవితాంతం తోడు ఉండాలి.
అదే లక్ష్యం . అదే వేగం. అదే పరుగు. అదే విజయం… లతమ్మ గెలిచింది..
నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించి పోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మని ని 5000గా చేసి అందించారు. ఆమె ఆ డబ్బుతో తిరిగి ఆసుపత్రికి పరిగెట్టింది.. ఆమె ప్రేమ ఊరికే పోలేదు. ఆమె లక్షం ముందు సమస్య చిన్న బోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది.. అన్నీ పత్రికలు లతమ్మ గురించి గొప్పగా రాశాయి. దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి.. నెల తిరిగే సరికి ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బ్యాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి…