వాట్సప్ ఆపిన పెళ్లి..

636

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఫేస్ బుక్ ప్రేమలు, వాట్సాప్ పరిణయాలు.. ఎక్కువయ్యాయి. అదే ఆ వాడకం అతిగా మారిన తర్వాత ఫేస్ బుక్ విడాకులు, వాట్సాప్ అనుమానాలు అంత కంటే ఎక్కువగా పెరిగిపోయాయి. తాజాగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. వాట్సాప్ కి బానిసైన ఓ పెళ్లికూతురు ఏకంగా తన పెళ్లినే కాలదన్నుకోవాల్సి వచ్చింది. పెళ్లి నిర్ణయం చేసుకున్నప్పటి నుంచి అమ్మాయి వాలకం చూసి విసుగెత్తిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ఈ కోడలు మాకొద్దుబాబోయ్ అంటూ తేల్చి చెప్పారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. అమ్రోహా జిల్లాకు చెందిన ఓ వధువు, తన కుటుంబీకులతో కలిసి వరుడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో వరుడి తరఫు వారు రానే వచ్చారు. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు. దాంతో వధువు, ఆమె కుటుంబీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కారణమేంటని అడగ్గా.. వధువు 24 గంటలూ వాట్సాప్‌తోనే బిజీగా ఉంటోందని, అలాంటి వ్యసనం ఉన్న కోడలు వద్దని అన్నారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య వాదన చోటుచేసుకుంది. వధువు తరఫు వారు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికి రూ.64 లక్షలు కట్నంగా కావాలని డిమాండ్‌ చేశారని అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వరుడి కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు.