పెళ్ళాం ఉండగా మరొకామెను ఏలుకోమన్నారు..

118

ఇదో విచిత్రమైన కేసు. పెళ్ళయిన వ్యక్తికి మరో వివాహితను పెళ్ళి చేసుకోమని పోలీసుల ఒత్తిడి. ఈ టార్చర్ భరించలేని సదరు వ్యక్తి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే… మూలాపేటలో శేఖర్, సాయిభాను దంపతులు నివసిస్తున్నారు. బీవీనగర్ కు చెందిన అఖిల అనే వివాహిత తనను పెళ్ళి చేసుకోమని శేఖర్ ను ఒత్తిడి చేస్తోంది. అక్కబావలైన పద్మ, రవిలు అఖిలకు మద్దతిస్తూ వచ్చారు. పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని శేఖర్ తేల్చిచెప్పడంతో, అఖిల తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఒకకోణంలోనే ఆలోచించిన పోలీసులు అఖిలను పెళ్ళి చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించి, అఖిలను శేఖర్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీంతో మనస్థాపం చెందిన శేఖర్ భార్య సాయిభాను ఆత్మహత్యకు యత్నించడంతో, కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న మహిళా సంఘం నాయకురాలు షాహినాబేగం ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీసులు ఈ కేసు విషయంలో తప్పుడు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధిత శేఖర్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.