నాగ్ కెరీర్ @ 30 ఇయ‌ర్స్‌

494

క్లాస్‌ ఆడియన్స్‌ని అలరించిన‌ ‘కింగ్‌’, మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న ‘మాస్‌’, అన్నిటినీ మించి మ‌గువ‌ల మ‌న‌సు దోచుకున్న ‘మ‌న్మ‌ధుడు’… అక్కినేని నాగార్జున‌. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట వార‌సుడిగా నాగార్జున వెండి తెరంగేట్రం చేసి నేటికి స‌రిగ్గా 30 ఏళ్ళు. ఆయ‌న న‌టించిన తొలి చిత్రం ‘విక్ర‌మ్‌’ 1986 మే 23న విడుద‌లైంది. 1983లో హిందీలో సుభాష్ ఘాయ్ నిర్మించిన‌ ‘హీరో’ చిత్రాన్ని ‘విక్ర‌మ్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రానికి విక్ట‌రీ మ‌ధుసూధ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తొలి చిత్రంతోనే నాగ్ సూప‌ర్ హిట్‌ని అందుకున్నాడు. హీరోయిన్‌ శోభ‌నకిది తొలి తెలుగు చిత్రం. తొలినాళ్ళ‌లో ఒక‌ట్రెండు ఎదురుదెబ్బ‌లు త‌గిలినా, ఆ త‌ర్వాత‌ ఇండ‌స్ట్రీలో హీరోగా నిల‌దొక్కుకున్నాడు నాగ్‌.

ఇక నాగార్జునకి ట‌ర్నింగ్ ఇచ్చిన సినిమా ‘శివ‌’. రామ్‌గోపాల్ వ‌ర్మ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. నాగ్ కెరీర్‌లో ‘శివ’ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది. ఈ మూవీ హిట్‌తో మాస్‌లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నారు. అంత‌కుముందు ‘గీతాంజ‌లి’ చిత్రంతో అమ్మాయిల మ‌న‌సు దోచుకున్నాడు నాగ్‌. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఇదొక్క‌టే కావ‌డం విశేషం. ఈ చిత్రంతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడాయ‌న‌.

హీరో అయిన కొన్నాళ్ళ‌కే నాగార్జున అగ్ర క‌ధానాయ‌కుడిగా ఎదిగాడు. టాప్ 4లో ప్లేస్ ద‌క్కించుకున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాల్లో న‌టించాడు. తెలుగులో తాను న‌టించిన హిట్ మూవీ ‘శివ’, హిందీ రీమేక్‌ ‘శివ’లోనూ న‌టించాడు. ఆ త‌ర్వాత ఖుదాగ‌వా, ద్రోహీ, క్రిమిన‌ల్‌, మిస్ట‌ర్ బేచారా, జ‌క్మ్‌, అంగారే, అగ్నివ‌ర్ష‌, ఎల్ఒసీ కార్గిల్ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. త‌మిళంలోనూ అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించారు. మ‌రికొన్ని చిత్రాల్లో గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇచ్చి అల‌రించారు. ట్రెండ్‌కి త‌గిన‌ట్లు, జ‌న‌రేష‌న్‌కి త‌గ్గ‌ట్లు స్టైల్స్ మెయిన్‌టైన్ చేయ‌డంలో అంద‌రు హీరోల కంటే ముందుంటారు నాగ్‌.

త‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్ద‌రూ ఇద్ద‌రే, శ్రీరామ‌దాసు, మ‌నం చిత్రాల్లో న‌టించారు నాగ్‌. త‌న కొడుకులు, మేన‌ల్లుడితోనూ క‌లిసి న‌టించిన క్రెడిట్ కూడా నాగ్ సొంతం. మేన‌ల్లుడు సుమంత్‌తో క‌లిసి ‘స్నేహ‌మంటే ఇదేరా’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక కొడుకులు అఖిల్‌తో ‘సిసింద్రీ’, నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ‘మ‌నం’ చిత్రాల్లో న‌టించాడు. ఇక తెలుగు ఇండ‌స్ట్రీలో మూడు త‌రాల తార‌లు క‌లిసి ఒకే సినిమాలో న‌టించిన క్రెడిట్ కూడా అక్కినేని వంశానిది కావ‌డం, అందులో నాగ్ మెయిన్ రోల్ చేయ‌డం విశేషం. అక్కినేని త్ర‌యం క‌లిసి న‌టించిన ఆ చిత్రం ‘మ‌నం’.

నాగార్జున త‌న 30 ఏళ్ళ కెరీర్‌లో అన్నిర‌కాల పాత్ర‌లను ట‌చ్ చేశారు. ల‌వ్‌, యాక్ష‌న్‌, ఫ్యామిలీ, ఎంట‌ర్‌టైన‌ర్‌, ఎక్స్‌పెరిమెంట‌ల్ చిత్రాల్లో న‌టించి ఆల్‌రౌండ‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నేటిత‌రంలో ఆధ్యాత్మిక చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, షిరిడీ సాయి చిత్రాల్లో టైటిల్ పాత్ర‌ల్లో జీవించి ప్రేక్ష‌కుల్ని భ‌క్తి పార‌వ‌శ్యంలో ముంచెత్తారు. నాగ్ న‌టించిన భ‌క్తిర‌స చిత్రాల్లో ‘అన్న‌మ‌య్య’ విశిష్ట‌స్థానం సంపాదించుకుంది. న‌టుడిగా ఆయ‌న‌ను వంద రెట్లు పైకి తీసుకెళ్ళింది ‘అన్న‌మ‌య్య’ చిత్రం.

నాగ్ కేవ‌లం న‌టుడే కాదు, అభిరుచి ఉన్న నిర్మాత కూడా. మంచి మంచి సినిమాలు నిర్మించారు. కొత్త‌ వారిని, టాలెంట్ ఉన్న వారిని ఎంక‌రేజ్ చేయ‌డంలో ముందుంటారాయ‌న‌. గాయ‌కుడిగా కూడా ఒక‌ట్రెండు సినిమాల్లో పాట‌లు పాడి అల‌రించారు. న‌టుడిగా, నిర్మాత‌గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. న‌టుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మ‌రో రెండేళ్ళ‌లో 100వ చిత్రానికి చేరువ‌వుతున్నారు. మ‌రో మూడేళ్ళ‌లో ఆరు ప‌దుల వ‌య‌సుకు చేరుకోబోతున్నారు. ఇక ఇద్ద‌రు త‌న‌యులు వెండితెర‌పై హీరోలుగా రాణిస్తున్నారు. అయినా నాగ్ మాత్రం ఇంకా నిత్య య‌వ్వ‌నుడిగా మ‌న్మ‌ధుడిగా వెలుగులీనుతూనే ఉన్నారు.

 

రామ‌కృష్ణ‌.ఎస్‌