శవానికీ డబ్బులు కట్టించుకున్నారు..

151

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుతామంటూ ప్రకటనలిచ్చే నారాయణ వైద్యులు.. వైద్యం కోసం వెళ్లిన పేదోళ్లను సరాసరి నారాయణుడి దగ్గరకే పంపిస్తున్నారు. ఇందుకు తాజాగా నెల్లూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ. మూడురోజుల క్రిందట పొర్లుకట్టకు చెందిన షేక్ ఇస్మాయిల్ అనే 14 ఏళ్ల బాలుడిని కిడ్నీ వ్యాధితో నారాయణ హాస్పిటల్లో చేర్పించారు. ఉచితంగా వైద్యం అందిస్తారనుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేటప్పటికి హాస్పిటల్ సిబ్బంది చెప్పింది విని నోరెళ్లబెట్టారు. పేషెంట్ పరిస్థితి బాగోలేదని అర్జెంట్ గా మూడువేలు కట్టాలని చెప్పారు. ఐసీయూలో చేర్పించారు. ఆ తర్వాత 7500 కట్టాలని ఆపరేషన్ చేయాలనీ అన్నారు. తర్వాత రోజు అర్ధరాత్రి మళ్ళీ పదకొండువేల రూపాయలు బిల్ వేశారు. ఇంత మొత్తం తాము కట్టలేమని, కాస్త కనికరించాలని కాళ్ళా వేళ్ళా పడితే.. చివరగా 9వేలు కట్టించుకున్నారు హాస్పిటల్ సిబ్బంది. తర్వాత రోజు బాలుడు చనిపోయాడని తాము ప్రయత్నించామని చావుకబురు చల్లగా చెప్పారు. చివరగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా మరో రెండువేల ఐదువందలు కట్టించుకున్నారని బోరున విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు.