అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు

552

కావలి, అక్టోబర్-4: ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీటుగా పాలన సాగిస్తున్నారని అన్నారు జిల్లా ఇంఛార్జి మంత్రి శిద్ధా రాఘవరావు. కావలి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడిన శిద్ధా 28 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. బీద సోదరులు జువ్వలదిన్నెను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు మంజూరు చేయించారన్నారు.
రూ.17 కోట్ల పనులకు శంకుస్థాపన : పట్టణంలో రూ.17 కోట్ల పనులకు మంత్రి శిద్దా రాఘవరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మద్దూరుపాడులో రూ.12 లక్షలు, పెద్దపవనిరోడ్డులో ఆకాశవంతెన నిర్మాణానికి రూ. 7.80 కోట్లు, రూ.4.20 కోట్లతో పురపాలక సంఘంలోని పలు అభివృద్ధి పనులు, పుల్లారెడ్డినగర్‌, వివేకానంద పార్కుల అభివృద్ధికి రూ.50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల నిధులతో నిర్మించిన పొదుపు మహిళల సీఆర్‌సీ భవనాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు, కావలి మున్సిపల్ చైర్ పర్సన్ అలేఖ్య పాల్గొన్నారు.