అజీజ్ @ అమరావతి..

188

నగర మేయర్ అజీజ్ అమరావతికి చేరుకున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు అజీజ్. అయితే మంత్రి నారాయణ తానే సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. మైనార్టీలు ఎక్కువగా వుండే సిటీ నుంచి పోటీకి అజీజ్ కి అవకాశం కల్పించాలని ముస్లిం మతపెద్దలు పదేపదే డిమాండ్ చేస్తూ వచ్చారు. ఒకదశలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. ఈ నేపధ్యంలో పార్టీ నాయకత్వంతో తేల్చుకునేందుకు అమరావతికి బయలుదేరి వెళ్ళారు. సీఎం చంద్రబాబుతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి ముందుగా టీడీపీలో మైనార్టీ వర్గ నాయకులు, శాసనమండలి చైర్మన్ షరీఫ్తోనూ, మంత్రి ఫరూక్ తోనూ చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ చేజారడం తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా నారాయణ పదవీకాలం పూర్తి కానుండడంతో ఆయన స్థానంలో తనపేరును పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తే.. మైనార్టీ వర్గాల్లో అనుకూల పవనాలు వుంటాయని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఇద్దరు నాయకులకు కార్పోరేషన్ పదవులు ఇచ్చేశారు. మేయర్ పదవిలో వుండికూడా తనకు అవకాశం కల్పించడం లేదని వాపోతున్నారు. నగరంలో రాజకీయంగానూ ఓట్ల పరంగానూ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా తనకు అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరనున్నారు. ఈరోజో రేపో అజీజ్ ముఖ్యమంత్రిని భేటీ అయిన తర్వాతనే ఆయన భవిష్యత్ నిర్ణయం ఏమిటనేది తేలుతుంది.