ప్రథమ పౌరుడికి లాస్ట్ బెంచ్..

132

నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ కు మరో దఫా అవమానం. నగర ప్రథమ పౌరుడుగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పేరే శిలాఫలకాల్లో మొదట ఉండాలి. కార్పొరేషన్ ప్రోటోకాల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే ఈ రోజు 9కోట్ల తో రంగనాయకుల స్వామి ఘాట్ కు శంకుస్థాపన శిలాఫలకంలో అజీజ్ పేరు విశిష్ట అతిథుల జాబితాలో చేరిపోయింది. పట్టణ ప్రథమ పౌరుడు, అందరిలో ఒకరిగా మారిపోయాడు. శిలాఫలకం చూసిన అజీజ్ కు చిర్రెత్తుకొచ్చి అలిగి పక్కన ఉండిపోయాడు. శంకుస్థాపన జరిగిన తర్వాత శిలాఫలంకంలో పేర్లు చూసి ఇలా తనకు అవమానం జరగడం మూడో దఫా అని, ఎన్ని అవమానాలు చేస్తారో చేయండి అంటూ మంత్రిని నిలదీసి తనకు వేరే కార్యక్రమం ఉందంటూ వెళ్లిపోయాడు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో అజీజ్ కు ఇలాంటి అవమానాలు తరచూ ఎదురవుతూ ఉన్నాయని, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీలను చిన్నచూపు చూడటం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం మేయర్ పేరే అగ్రస్థానంలో ఉండాలని, అటువంటిది అందరిలో ఒకడిగా మేయర్ పేరుని శిలా ఫలకాలపై ముద్రించడం సరికాదని అన్నారు.