ఏదో తేల్చుకుందాం.. ఎట్ట పోవాలో మీరే చెప్పండి..

274

ఏదో తేల్చుకుందాం.. ఎట్ట పోవాలో మీరే చెప్పండి..
—————————————
నెల్లూరు రూరల్ టిడిపిలో అసమ్మతి భగ్గుమంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిపై వెంకట స్వామి నాయుడు, ఆయన వర్గీయులు, ధ్వజమెత్తారు. దీంతో రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలిపోవడంతో మిగిలినవారితో ఆదాల ఎన్నికల ప్రచారానికి మొన్ననే శ్రీకారం చుట్టారు. 48గంటలు గడవకముందే అసమ్మతి నేతలు ధిక్కార స్వరం వినిపించారు. రూరల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గ్రంధాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఆదాలపై తమకు మ్మకం లేదని, ఆదాల పోటీ చేస్తే ఓటమి ఖాయమని వారు వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కిలారి తిరుపతి నాయుడు కల్యాణ మండపంలో టీడీపీ సీనియర్ నాయకులు ఆదాల వైఖరిపై మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతుంటే తమను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఆదాల వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కొందరు సీనియర్లు ఆదాల వ్యవహార శైలిని తప్పుపట్టారు. సీనియర్లను కలుపుకుని పోవడం లేదని ఓ సీనియర్ నాయకుడు ఆదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం..మంత్రి సోమిరెడ్డి , నారాయణ వచ్చి హామీ ఇస్తేనే అదాలతో కలిసి పని చేస్తామని వారు తీర్మానం చేసుకున్నట్లు తెలుస్తోంది.. దాదాపు 60 మంది అసమ్మతి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అసమ్మతి టీడీపీ వర్గాల కథనం.