హెచ్‌-1బీ వీసాలు జారీలో కీలక ప్రతిపాదనలు…

170

 

హెచ్‌-1బీ వీసాలు అత్యంత ప్రతిభావంతులకు, ఎక్కువ జీతం వచ్చే వారికే దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది. అమెరికాలో విదేశీయులకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే ఈ హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన మార్పులు చేస్తూ అక్కడి యంత్రాంగం శుక్రవారం పలు ప్రతిపాదనలు చేసింది. హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనే కంపెనీలు ముందుగానే యూఎస్‌సీఐస్‌లో ఎలక్ట్రానికల్‌గా నమోదు చేసుకోవాలని అమెరికా ఇటీవల నూతన నిబంధనను ప్రకటించింది. దీంతో పాటు అమెరికాలో చదువుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఇతర దేశాల్లో చదువుకుని ఉద్యోగాల కోసం వచ్చే వారికి వీసా క్యాప్‌ తగ్గించి అమెరికాలో చదువుకున్న వారికి వీసాలు పెంచాలని తాజాగా ప్రతిపాదనలు చేసింది.
అమెరికాలోని కంపెనీల్లో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు హెచ్‌-1బీ వీసా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ కంపెనీలు ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం ఏటా 65వేల హెచ్‌-1బీ వీసాలు జారీ చేయాలి. దీంతోపాటు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి 20వేల వీసాలు ఇవ్వాలి. అయితే తాజాగా ప్రతిపాదించే నిబంధనల ప్రకారం యూఎస్‌లో చదువుకుని హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అధిక ప్రాధాన్యం కలుగుతుంది. అలాగే దరఖాస్తు దారుల్లో అత్యంత ప్రతిభావంతులకు, ఎక్కువ జీతం అందుకుంటున్న వారికి లాభం చేకూరాలని.. అలాంటి నిపుణుల వల్ల అమెరికాకు కూడా లాభం జరుగుతుందని ట్రంప్‌ యంత్రాగం భావిస్తోంది. గత ఏడాది హెచ్‌-1బీ వీసాల్లో 75.6శాతం భారతీయులకే దక్కాయి.