‘ముక్కెర’ అందానికే కాదు…ఆరోగ్యానికి కూడా

1081

ముక్కుపుడక… ఆడవారు ధరించే ఆభరణాల్లో అత్యంత ఆకర్షణీయమైనది. అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా. ఆమధ్య కొంతమంది మోటుగా భావించి ముక్కు కుట్టించుకోవడం మానేసినా.. మళ్లీ ఇప్పుడు ముక్కు పుడక ట్రెండ్ రాజ్యమేలుతోంది. కేవలం ఆకర్షణ కోసమే కాదు, ముక్కు పుడక బోలెడంత ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందట.

సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట. ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి టుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.

ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.

ఆరోగ్యం మాట పక్కనపెడితే అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలే ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుందట. అదివ్వగానే లంకెబిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుందట. ఇక పురాణాల్లో దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే ప్రళయం వస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.

అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. తాళిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కుపుడకను కొంద‌రు మ‌హిళ‌లు జీవితాంతం ఉంచుకుంటారు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. ముక్కెర కేవ‌లం అందానికి, సౌభాగ్యానికే కాదు… ఆరోగ్యానికి కూడా మంచిది.