రామ్ గోపాల్ వర్మని ఇలా ఎప్పుడూ చూసి ఉండం..

741

చేతిలో తిరుపతి లడ్డూ పట్టుకుని, భుజంపై కండువా వేసుకుని, నుదుట బొట్టుతో ఇదివరకు ఎప్పుడూ చూడని గెటప్‌లో దిగిన ఫొటోను వర్మ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ కోసం ఎన్టీఆర్‌‌ నన్ను ఇలా మార్చేశారు’ అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటో చూసి వర్మ అభిమానులు షాకయ్యారు. ‘మేం చూస్తున్నది వర్మనేనా? ఇంత మార్పా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తానో నాస్తికుడినని, అసలు దేవుడిపై నమ్మకమే లేదని చెప్పుకొంటూ ఉంటారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కానీ, ఆయనలో ఒక్కసారిగా అనుకోని మార్పు వచ్చింది. వర్మకు దేవుడిపై భక్తి పొంగిపోతోంది. ఇందుకు కారణం దివంగత నటుడు నందమూరి తారక రామారావేనని అంటున్నారు వర్మ. ఎన్టీఆర్‌ జీవితాధారంగా ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కాణిపాకం గణపతిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వర్మ.
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను వర్మ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌చేశారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిలా ఎన్టీఆర్‌ చేసిన సేవలు, ఆయన చనిపోయాక జరిగిన అంతిమయాత్ర దృశ్యాలను చూపించారు. ‘ఎన్టీఆర్ నిజమైన అభిమానులందరికీ నా బహిరంగ ప్రకటన. నిజానికి నిజంగా జీవించేవారికి మరణం ఉండదు.’ అంటూ వర్మ ఈ వీడియోలో పేర్కొన్నారు.