సెల్ఫీ మోజులో ప్రాణాలు వదిలారు..

151

సూళ్లూరుపేటలో పాముతో సెల్ఫీ తీసుకోవాలనే మోజుతో ఓ యువకుడు ప్రాణాలు వదిలిన సంఘటన ఇటీవలే నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. యువతను సెల్ఫీ మోజు మాత్రం వదలడంలేదు. ప్రమాదాల అంచున నిలబడి సెల్ఫీ తీసుకుని వీరుల్లా, శూరుల్లా ఫోజులివ్వాలని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి లైక్ లు, కామెంట్లు పొందాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. ఇలాంటి ఉబలాటమే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల జీవితాలను బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయం వద్ద ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్‌(19), విజయనగరం పట్టణానికి చెందిన మల్లుల సాయితరుణ్‌(19)లు ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. సరదాగా జలాశయం పరిసరాలు చూసేందుకు వెళ్లారు. అక్కడ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే ప్రాంతంలో సెల్ఫీలకోసం దిగి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. వీరు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోతైన ఈ ప్రాంతం కావడంతో గంటలకొద్దీ జాలర్లు గాలించి మృతదేహాలను బయటకు తీశారు.