సర్టిఫికెట్ కోసం వెళ్తే.. చేయి చేసుకున్న ఎమ్మార్వో..

1208

క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ కోసం ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లిన ఓ యువతిపై, మహిళా తహశీల్దార్ చేయిచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లిలో చోటుచేసుకుంది. నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన తహసీల్దార్‌ కేసీ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహంతో చేయిచేసుకున్నారని సరిత రోదిస్తూ తెలిపింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై తహసీల్దార్‌ ప్రమీలను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. తాను ఎవరిపై చేయిచేసుకోలేదని, కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తెలిపారు.