బాహుబలి షూటింగ్ స్పాట్ లో స్టూడెంట్స్ దుర్మరణం..

119

బాహబలి సినిమా తీసిన లొకేషన్ అది. అక్కడికి వెళ్లినవారంతా సెల్ఫీ దిగాలని తెగ ఉబలాటపడుతుంటారు. అలానే ముగ్గురు విద్యార్థులు అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగాలని సరదా పడ్డారు. నీటి గుంటలో పడి దుర్మరణంపాలయ్యారు. ముందూ వెనకా ఆలోచించకుండా సెల్ఫీ తీసుకోవాలన్న సరదా… ఆదివారం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. హైదరాబాద్‌ శివారులోని కొత్వాల్‌గూడ వద్ద క్రషర్‌ ప్లాంట్‌ నీటిగుంతలో ఈత కోసం వెళ్లిన వారు ప్రమాదవశాత్తు జారిపడిపోయారు. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం, మోతీనగర్‌కు చెందిన సూర్య (22) భోపాల్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అతడి తమ్ముడు చంద్రకు భార్గవ్‌(ఇద్దరికీ 18 ఏళ్లు)తో పాటు కొందరు స్నేహితులున్నారు. వీరంతా ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు.సెలవు కావడంతో, హిమాయత్‌ జలాశయం సమీపంలో బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన గుంతల వద్ద ఈత కొట్టేందుకు బైకులపై వెళ్లారు.అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో సూర్య కాలు జారి పడి మునిగిపోయాడు. అన్నను బయటకు తీయడానికి చంద్ర ఆ నీటిలోకి దూకాడు. ఆ ఇద్దరినీ కాపాడేందుకు భార్గవ్‌ కూడా నీటిలోకి దూకడంతో, ముగ్గురూ మరణించారు. మిగిలిన స్నేహితులు తక్షణమే వారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. లోపల 20అడుగుల మేర నీరు ఉండటంతో, ముగ్గురి మృతదేహాలనూ వెలికి తీయడానికి నాలుగు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.