శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి..

343

తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి నుంచి మరింత వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు కృష్ణమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం జలాశయం 5,6,7,8 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. నాలుగు గేట్ల ద్వారా లక్షా 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3,62,098 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.