ఆరోగ్య ప్ర‌దాయిని ‘తుల‌సి’

649

తులసి… హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు. తులసి వృక్షానికి ఉన్నంత విశిష్టత మరే చెట్టుకు లేదని పురాణాలు కూడా చెబుతుంటాయి. మహాభారతంలో ఘటోత్కచుడు కూడా మోయలేని శ్రీకృష్ణుడిని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత మహిమాన్వితమైనది తులసి. అందుకే హిందువులు తులసిని పవిత్రంగా కొలుస్తుంటారు. అయితే ఇది పూజ నీయమైనదే కాదు… ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం కూడా. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సైన్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన తుల‌సి ఆరోగ్య ప్ర‌దాయిని. తులసి ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీళ్ళతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటి పొక్కులు పోతాయి. తులసి రసంలో ఒక చెంచా తేనె చేర్చి తాగితే కఫం ఇట్టే తగ్గిపోతుంది. తులసి ఆకులను గోరు వెచ్చని నీటిలో కాసేపు మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి క్రమేణా తగ్గిపోతాయి. జ్వరంతో బాధపడేవారు పుదీనా ఆకులకు తులసి ఆకులను జత చేసి కషాయంగా కాచి తాగితే జ్వరం తగ్గిపోతుంది.  తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే శరీరంలోని కొవ్వు కూడా కరిగిపోతుంది.

తులసి విశిష్టతల గురించి ఆయుర్వేద శాస్త్రాలే కాదు…  సైన్స్ కూడా చెప్పిన సత్యాలివే. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్‌ని తగ్గిస్తాయని ఈమధ్యే ధృవీకరించారు. తులసికి ఉన్నఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు దరి చేరవట. ఇక తులసి ఉన్న ప్రాంతంలో పిడుగు కూడా పడదట. అంతేకాదు కాలుష్య ప్రభావాన్ని కూడా తగ్గించే గుణం తులసికే ఉంది. అందుకే దేశానికి తలమానికంగా ఉన్న తాజ్‌మహల్ వద్ద లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచుతున్నారు.

ఎన్నోరకాల చెట్లు, మొక్కలు ఉదయం మొత్తం కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, ఆక్సిజన్‌ని వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డై ఆక్సైడ్‌ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి. కానీ తులసి చెట్టు మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్‌ను విడిచిపెడుతుందని వైజ్ఞానిక పరిశోధనల్లో తేలింది. ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూని భారత్‌లో చొరబడకుండా అడ్డుకున్నది కూడా తులసి వృక్షమేనట‌. తులసి గాలి కారణంగా మనుషుల్లో స్వైన్ ఫ్లూని తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరిగిందట.  తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీన్ని ధృవీకరించారు.

ఆయుర్వేద చికిత్సల్లో తులసి వృక్షానికి ఉన్నంత ప్రాముఖ్యత మరే చెట్టుకి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. తులసి మనిషి ఆయుషుని పెంచుతుంది. ఈ చెట్టు వద్ద ప్రాణాయామం, యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితాలనిస్తుంది. తులసి ఆకుల రసానికి శరీర ఉష్టోగ్రతను సమతుల్యంగా ఉంచే మహత్తర గుణం కూడా ఉంది. ఇక తులసిలో విద్యుచ్చక్తి అధికంగా ఉంటుందని వేదాల్లోనే కాదు, సైన్స్ కూడా చెబుతోంది. తులసి చుట్టూ ప్రదక్షిణం చేస్తే తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా మానవాళికి దోహద పడుతున్న దివ్య ఔషధం తులసి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఆరోగ్య ప్రదాయినిని సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యం అందరిచేతుల్లో ఉన్నట్లే.