వెంకన్న సేవలో వెంకయ్య …

334
తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలసి మహాద్వారం వద్దకు చేరుకున్న వెంకయ్యనాయుడికి ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ తితిదే ఉన్నతాధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఉప రాష్ట్రపతి కొద్దినిమిషాల పాటు స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధి నుంచి ప్రదక్షిణంగా హుండీ వద్దకు చేరుకుని కానుకలు సమర్పించారు. అక్కడి నుంచి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు కలసి స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని, శ్రీవారి చిత్రాలతో ముద్రించిన 2019 క్యాలెండర్‌, డైరీలను అందజేశారు.
దర్శనానంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్బంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరింత శక్తిని ప్రసాదించమని, భారతదేశ ప్రజలు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తితిదే యంత్రాంగాన్ని కోరినట్లు వివరించారు.