వెంకటగిరిలో రాజకీయ వేడి..

108

వెంకటగిరిలో రాజకీయ వేడి..
కురుగొండ్లతో ఆనం ఢీ అంటే ఢీ..
వెంకటగిరి నియోజకవర్గంలో అసలైన యుద్ధం మొదలైంది. నాలుగున్నరేళ్లుగా ఎదురులేకుండా ఉన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆనం రూపంలో గట్టిపోటీ ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొమ్మి లక్ష్మయ్య నాయుడు వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపొందిన తర్వాత ఆయన ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదు. వైసీపీకి కూడా దూరమైపోయారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నా అక్కడ ఆయన ఉనికి ఉండీ లేనట్టుగానే ఉంది. అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీతో ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టింది. ఇరువర్గాల్లోనూ కాక ఎక్కింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం కలకలం రేపింది. ఇంచార్జి పదవి తీసుకున్నప్పటినుంచి రామనారాయణ రెడ్డి పెంచలకోనతో మొదలు పెట్టిన రాజకీయ యుద్ధం ఇరువర్గాల మధ్య ఇప్పుడు ఊపందుకుని రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే రామకృష్ణ నేను పక్కా లోకల్ అంటూ ఇతర ప్రాంతాల వారికి వెంకటగిరి నియోజకవర్గంలో చోటులేదని ప్రచారం చేస్తున్నారు. దీనికి సమాధానంగా పక్కా లోకల్ పాటలో వ్యాంప్ క్యారెక్టర్ లాగా ఎమ్మెల్యే రామకృష్ణ తయారయ్యారంటూ ఆనం వర్గం ధ్వజమెత్తింది. ఇది ఇప్పుడు రాజుకుని ఇరువర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసకందాయంలో పడింది. రామనారాయణ రెడ్డి పార్టీ ఫిరాయింపులను గతంలో ఆయన చేసిన ప్రకటనలను ఆయన ఆస్తులు కూడబెట్టుకున్నారని కురుగొండ్ల వర్గం ఆరోపణలు చేయగా, రామనారాయణ రెడ్డి వర్గం ఎమ్మెల్యేగా కురుగొండ్ల అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకుంటూ అడ్డంకిగా మారారని, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రైల్వే కాంట్రాక్టర్లనుంచి 5కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన విషయం, రోడ్ కాంట్రాక్ట్ లో 4 కోట్ల రూపాయలు దిగమింగిన విషయం ఇలా ఆయన అవినీతి వల్ల నియోజకవర్గ ప్రతిష్టే దిగజారిపోయిందని తీవ్రమైన ఆరోపణలకు పూనుకున్నారు. ఈ దశలో గతంలో రామకృష్ణ బియ్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారని, అప్పట్లో ఆయనమీద కేసులకు సంబంధించి, సూళ్లూరుపేట, నాయుడుపేట స్టేషన్లలో దాఖలైన కేసులు, అప్పట్లో గోతాల రామకృష్ణ అంటూ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లను ఇప్పుడు వెలుగులోకి తెస్తున్నారు. జడ్పీ ఎన్నికల సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పై కురుగొండ్ల దౌర్జన్యం చేసిన విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఒక్కసారిగా వారం రోజుల వ్యవధిలోనే వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం ఇలా సెగలు పొగలు కక్కుతోంది. ఇంతవరకు ప్రతిపక్షంగా కురుగొండ్ల రామకృష్ణను ఎదుర్కొన్నవారెవరూ లేకపోవడంతో రామనారాయణ రెడ్డి రంగప్రవేశంతో ఇప్పుడు వెంకటగిరిలో అసలైన యుద్ధం మొదలైంది.